రిలీజ్‌కు ముందే ఆల్ టైమ్ రికార్డ్‌.. ‘AA23’ ఎక్కడా తగ్గట్లేదుగా!

by | Jan 28, 2026 | సినిమా

పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌గా ఎదిగాడు యువ కథానాయకుడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తోన్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత మరో కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ని కూడా మేకర్స్ సంక్రాంతి కానుక‌గా ప్రకటించారు. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. అయితే ‘AA23’ (AA23) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఓ అరుదైన ఆల్‌టైమ్ రికార్డును సాధించింది. కేవలం ఈ మూవీ అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్‌తోనే (Theme Music) ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఏకంగా 355K (3.55 లక్షల) పైగా రీల్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత సినీ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది.

కాగా, ఈ మూవీ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలని ఒక్కసారిగా పెంచేసింది. ఇటీవలి కాలంలో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌కు ఇంత పెద్ద ఎత్తున హైప్ రావడం అంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanaka Raj) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటించబోయే ఈ సినిమా ఓ సూపర్ హీరో మూవీలా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో హీరోకు ఓ చేయి ఐరన్ హ్యాండ్ లా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం లోకేశ్ కనకరాజ్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అనౌన్స్‌మెంట్‌తోనే ఇన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా విడుదలయ్యాక మరిన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి.