‘ఫంకీ’ సినిమా రిలీజ్.. ఆ ఇద్దరికీ అగ్ని పరీక్షే.!

by | Jan 28, 2026 | సినిమా

టాలీవుడ్‌లో విభిన్న చిత్రాలు చేస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యువ కథానాయకుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen). కెరీర్‌ తొలినాళ్లలో వరుస హిట్స్‌ అందుకున్న ఈ యువ హీరో గత కొంతకాలంగా ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఆయన నటించిన చివరి సినిమా ‘లైలా’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ప్రస్తుతం ఫంకీ సినిమానే ఆశలు పెట్టుకోగా.. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ (Funky) సినిమాకు ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్‌ (Anudeep) దర్శకత్వం వహించాడు. ఇక ‘పిట్టగోడ’తో దర్శకుడిగా కెరీర్ మొదలెట్టిన కె.వి.అనుదీప్‌ ఆ తర్వాత ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే సినిమా రూపొందించగా ఈ మూవీ బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.

దాంతో ఇప్పుడు ‘ఫంకీ’ సినిమా దర్శకుడుగా అనుదీప్ (Anudeep) కు హీరోగా విశ్వక్ సేన్ (Vishwak Sen) కు అగ్ని పరీక్షగా మారిపోయింది. ఈ సినిమా ఫలితం మీదే వీరిద్దరి కెరీర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. కాగా, హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కూడా ఫిబ్రవరి 13న విడుదల కానుండగా.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేశారు. మరి పోటీలేకుండా వస్తున్న ‘ఫంకీ’ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి. కాగా, ‘ఫంకీ’ (Funky) చిత్రాన్ని ఈ చిత్రాన్ని శ్రీక‌ర స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ క‌యాదు లోహ‌ర్ కథానాయికగా నటిస్తోండగా.. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.