‘పెద్ది’ రిలీజ్‌పై సస్పెన్స్ .. ఆ పండక్కి రానుందా?

by | Jan 28, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Jahnavi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కానుకగా మార్చి 27 న పెద్ది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. వీటితో పాటుగా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి సాంకేతిక అంశాలను అత్యున్నత స్థాయిలో అందించాలని మేకర్స్ భావిస్తున్నారు.

వీటన్నిటితో పాటుగా తెలంగాణలో టికెట్ రేట్ల అంశం ప్రస్తుతం సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ‘పెద్ది’ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘పెద్ది’ (Peddi) సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వేసవి కంటే కూడా దసరా సీజన్‌ అయితేనే ఉత్తమం అని భావిస్తున్నారట మేకర్స్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) మరియు సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి