బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఫస్ట్​ సైన్స్ ఫిక్షన్ మూవీ రీ రిలీజ్‌

by | Feb 26, 2025 | సినిమా

నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369). 1991లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ ఫస్ట్ ఇండియన్ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని, బాలయ్య గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా  సంగీత స్వరాలు అందించారు. ఇందులో శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన..  జంధ్యాల సంభాషణలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా.. మరోసారి ‘ఆదిత్య 369’ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి 4K లో ఈ సినిమాను వేసవి కానుకగా  రీ రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కానీ రిలీజ్​ డేట్​ను మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్​లో ఉంచారు. ఇక ఈ వార్త తెలిసిన బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఐకానిక్ మూవీ ‘ఆదిత్య 369’ను బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరోవైపు ప్రస్తుతం బోయపాటి ‘అఖండ-తాండవం’ షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది.