RRR టీంను లైవ్‌లో కలిసే గోల్డెన్ ఛాన్స్

by | Apr 6, 2025 | సినిమా

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ (Ram Charan) , ఆయన జోడీగా అలియాభట్‌ నటించారు. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ (NTR) నటించగా ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ అలరించారు. 2022లో మార్చి 25 విడుదలైన ఈ మూవీ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుని ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటనతో అభిమానులను కట్టిపడేశారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రంగా హిట్‌ కొట్టిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ సృష్టించింది.

ఇక ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో దర్శకుడు రాజమౌళి (Rajamouli) హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ముగ్గురూ క‌లిసి అనేక ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొన్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ ముగ్గురు మ‌ళ్లీ క‌లిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నది లేదు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు మరోసారి కలిసి అభిమానులతో ముచ్చటించనున్నారు. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్‌ రాయల్‌ ఆల్బర్ట్‌ (Iconic Royal Albert) సినిమా హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రదర్శితం కానుంది. దాంతో పాటుగా ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు కీరవాణితో ఆర్ఆర్ఆర్ సాంగ్స్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా నిర్వహించనున్నారు. మే 11న సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరగనుంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబంధించి రాయల్ ఆల్బర్ట్ హాల్ సైట్ లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇందులో టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులకు నేరుగా ఆర్ఆర్ఆర్ టీంను నేరుగా కలిసి ముచ్చటించే అవకాశముంటుంది.

https://twitter.com/RoyalAlbertHall/status/1908186131729875088