ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ‘వీరమల్లు’ మళ్లీ వాయిదా?

by | Apr 5, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు. నిజానికి ఈ సినిమా మార్చి నెల 28నే విడుదల కావాలి. కానీ షూటింగ్‌ ఆలస్యం వల్ల రిలీజ్‌ డేట్‌ని మే 9కి వాయిదా వేశారు. కానీ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) వీరమల్లు షూటింగ్‌ను ఇంకా పూర్తి చేయలేదని, పైగా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కాస్త ఎక్కువ ఉన్న కారణంగా సినిమాను మరోసారి వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఇటీవలే ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం హీరో పవన్ కళ్యాణ్ ఇంకా ఐదు రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి. దాంతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవ్వాలి. ఇదంతా నెల రోజుల్లో అవుతుందా అనేది ప్రస్తుతం అభిమానుల్లో సందేహంగా మారింది. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ (Hari Hara Veeramalu)పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.