‘కూలీ’ Vs ‘వార్ 2’.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫైట్

by | Apr 4, 2025 | సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున (Nagarjuna) , శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్దే స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. రజనీకాంత్‌ (Rajanikanth) కెరీర్‌లో ఇది 171వ చిత్రం కావడం విశేషం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్‌ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ప్ర‌క‌టించారు.

ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. 2025 ఆగస్టు 14వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ (War) సినిమా కూడా ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్ కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వార్ 2 వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR) , హృతిక్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 14న ఒకే రోజున ‘కూలీ’, ‘వార్ 2’ వంటి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ అవనుండడంతో బాక్సఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారనుంది.