దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో పాటు మహేశ్ బాబు (Mahesh Babu) , రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమా తరహాలోనే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని వార్తలు వినిపించాయి. కథకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదని అందుకే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని టాక్ నడిచింది.
అయితే ఈ సినిమా కోసం రాజమౌళి (Rajamouli) ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. సినిమాను ల్యాగ్ చేసి రెండు పార్టులుగా తీయకుండా ఒకే పార్టులో కథ మొత్తం చెప్పేయలని జక్కన నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అభిమానులకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు రాజమౌళి ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. దాన్ని ఒకే పార్టులో ఎలా చెప్పబోతున్నాడు అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ చిత్రం అమెజాన్ (Amazon) అడవుల నేపథ్యంలో తెరకెక్కనుండగా.. దీనికి రామాయణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, మైథలాజికల్ గా తెరకెక్కించనున్నారని, ఈ కథ కాశీ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు

