15 ఏళ్ళు కలిసే ఉంటాం అన్న పవన్ కళ్యాణ్ కు పదవుల కన్నా అభివృద్దే ప్రధానమా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, అసెంబ్లీ సాక్షిగా 15 ఏళ్ళ పాటు ఈ కూటమి ఇలాగే కలిసే ఉంటుంది అని గతంలో ప్రకటించారు.
ఒక తల్లి కి పుట్టిన బిడ్డల మధ్యే బేధాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది మూడు పార్టీ లు కలిసి కూటమిగా ఏర్పడ్డప్పుడు బేధాభిప్రాయాలు సహజం అని అన్నారు. వీటన్నింటిని అందరితో చర్చించి పరిష్కరించుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం – ప్రజా సంక్షేమంతో కూడిన అభివృద్ధి, వైస్సార్సీపీ పార్టీని అసెంబ్లీ లో అడుగుపెట్టనీయకూడదు
మొదటిది కూటమి 15 ఏళ్ళు కలిసే ఉంటుందంటే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారం లో ఉంటుందనేనా దానర్ధం.
రెండవది జనసేన పార్టీకి సొంతంగా అధికారం లోకి రావాలని లేదా? పవన్ కల్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి కన్నా రాష్ట్రాభివృద్దే ముఖ్యమా
ప్రస్తుతం చంద్రబాబుకు 75 ఏళ్ళు. మళ్ళీ ఎన్నికల నాటికి చంద్రబాబుకు 80 ఏళ్ళు వస్తాయి. 15 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణేనా.
ఇప్పటికే తెలంగాణాలో అధికారంలోకి రావాలని తహ తహలాడుతున్న భాజపాకు, ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి లో ఉండడమే శ్రేయస్కరం. ముందు అవకాశాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ లో గెలిచినా తరవాత భాజపా ఆంధ్ర ప్రదేశ్ మీద ఒంటరిగా దృష్టి పెడుతుంది
15 ఏళ్ళు కూటమి కలిసి ఉండడం అంటే అధికారంలో ఉండడమే. అయితే ఒకసారి ఈ పార్టీల గత ఎన్నికల ఫలితాలను చూద్దాం
2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 102 సీట్ లు గెలుచుకుంది. మిత్ర పక్షం భాజపా 4 సీట్ లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు. తెలుగుదేశం, భాజపా కూటమికి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కి 44.9% , భాజపా కు 2.2% ఓట్ షేర్ వచ్చింది. తెలుగు దేశం, భాజపా కలిపి 47.1% ఓట్ షేర్ తో 106 సీట్ లు గెలుచుకున్నారు. వైస్సార్సీపీ 44.6% ఓట్ షేర్ తో 67 సీట్ లు గెలుచుకుంది
ఇక 2019 లో ఏ పార్టీ కి ఆ పార్టీ విడిగానే పోటీ చేశాయి. ఎవరూ, ఎవరితో జత కట్టలేదు. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 23 సీట్లకే పరిమితం అయ్యింది (2014 లో 102 సీట్ లు). వైస్సార్సీపీ 151 సీట్ లు గెలుచుకుంది( 2014 లో 67 సీట్ లు). జనసేన ఒక సీట్ గెలిచి ఖాతా ఓపెన్ చేసింది
2014 నుండి 2019 తో పోలిస్తే తెలుగు దేశం పార్టీ ఓట్ షేర్ సుమారు 6% పడి పోయింది. అయితే సీట్ ల పరంగా 79 సీట్ లు కోల్పోయారు
2014 నుండి 2019 తో పోలిస్తే వైస్సార్సీపీ ఓట్ షేర్ సుమారు 5.4% పెరిగింది. అయితే సీట్ ల పరంగా 84 సీట్ లు అదనంగా గెలుచుకున్నారు
2024 లో తెలుగు దేశం, భాజపా, జనసేన మరోసారి కూటమి గా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేశాయి. ఈ సారి కూటమి 175 లో 164 సీట్ లు గెలుచుకుని సంచలనం విజయాన్ని నమోదు చేసింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో గెలిచింది. 144 స్థానాలలో పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ 135 సీట్ లు గెలుచుకుంది. భాజపా పోటీ చేసిన 10 స్థానాలలో 8 సీట్ లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కూటమి ఓట్ షేర్ సుమారు 55% గా ఉంది.
| Party | Seats Won | Vote Share | ||||
| 2014 | 2019 | 2024 | 2014 | 2019 | 2024 | |
| TDP+Janasena+BJP | 106 | 24 | 164 | 47.1% | 45.5% | 55.3% |
| YSCRP | 67 | 151 | 11 | 44.6% | 50.0% | 39.4% |
| Others | 2 | 0 | 0 | 8.3% | 4.5% | 5.3% |
ఈ లెక్కలను బట్టి ఈ మూడు పార్టీ లు కూటమి గా ఉంటేనే (తెలుగు దేశం, జనసేన, భాజపా), వైస్సార్సీపీ ని ఎదుర్కోవచ్చు అని తెలుస్తోంది.
అయితే 2014 లో తెలుగుదేశం, భాజపా కూటమి విజయం, 2024 లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయాన్ని ఒకలా చూడకూడదు
2024 లో కూటమి విజయానికి ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు, తెలుగు దేశం పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నప్ప్పుడు జైలు కు వెళ్లి చంద్రబాబు ను పరామర్శించి జైలు బయటే, ప్రెస్ మీట్ పెట్టి, కలిసి పని చేస్తామని ప్రకటించడంతో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపారు శ్రీ పవన్ కల్యాణ్. అంతే కాదు భాజపాని కూడా ఈ కూటమిలో చేర్చుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు మరువలేనివి. తెలుగుదేశానికి, భాజపా కి మధ్య వారధిగా నిలిచి ఈ కూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించారు. అందుకే ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కాదు తుఫాన్ అనిన్ అన్నారు
అంతే కాదు ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా, తాను నమ్మిన దానిని ఆచరణలో పెట్టి విజయం సాధించారు శ్రీ పవన్ కళ్యాణ్. జనసేన నిలబెట్టిన 21 స్థానాలలో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అంతే కాదు తెలుగు దేశం పార్టీ కూడా 94% స్ట్రైక్ రేట్ తో, భాజపా 80% స్ట్రైక్ రేట్ తో ఘానా విజయం సాధించాయి. తెలుగు దేశం, భాజపాలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో సాధించిన అతి పెద్ద విజయాలు. ఈ మాట చాలా సందర్భాలలో చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు
వీటితో పాటు, నారా లోకేష్ యువ గళం పేరుతో 3000 కిలోమీటర్ల పాద యాత్ర కూటమి విజయానికి దోహదం చేసింది. ఇవే కాకుండా వైస్సార్సీపీ పార్టీ, ప్రభుత్వం పట్ల యువతలో, ఉద్యోగస్థులలో ఉన్న వ్యతిరేకత కూడా పనిచేసింది
2024 లో కూటమి విజయానికి ప్రధాన కారణం జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్. చంద్రబాబుకు ఉన్న పరిపాలనా అనుభవం తో రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ని అసెంబ్లీ లో అడుగుపెట్టనీయకుండా ఉందడం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేశారు
2024 లో వైస్సార్సీపీ ఓటమికి గల కారణాలు చూద్దాం
2024 ఎన్నికలలో వైస్సార్సీపీ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి. వైస్సార్సీపీ పాలన లోనే కరోనా కూడా వచ్చింది. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి, అనాలోచిత లిక్కర్ పాలసీ ని తీసుకు రావడం, చంద్రబాబును జైల్లో పెట్టించడం, సొంత చెల్లెలు వై ఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై జగన్ ప్రభుత్వం పై సునీత రెడ్డి పోరాటం వంటి అంశాలు వైస్సార్సీపీ ని సెల్ఫ్ గోల్ వేసుకునేలా చేశాయి
అంతే కాకుండా, వాలంటీర్ల వ్యవస్థపై నెగటివిటీ, అన్ని వర్గాల వారికి బటన్ నొక్కి డబ్బులు వేయడమే తప్ప అభివృద్ధి పనుల మీద దృష్టి సారించకపోవడం, ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో సరిగా దృష్టి పెట్టకపోవడం, కూటమి ప్రభుత్వం ‘హూ కిల్డ్ బాబాయ్’ అనే స్లోగన్ ని ప్రజలలోకి బాగా తీసుకువెళ్లగలిగారు.
అంతే కాకుండా తన చుట్టూ ఒక కోటరీ ఏర్పరచుకుని, కార్యకర్తలకు, ప్రజలకు, అందరికి వై ఎస్ జగన్ దూరంగా ఉండడం (తెలంగాణ లో కెసిఆర్ మాదిరి) అనే విషయం ప్రచారంలో ఉండడం
వైస్సార్సీపీ కి జగన్ ఒక్కడే. వైస్సార్సీపీ ఓడిన, గెలిచినా జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. అయితే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ తో పాటు కేంద్ర ప్రభుత్వం లో ప్రధాని మోడీ, అమిత్ షా లు ఉన్నారు. ప్రొప్రైటరీ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ మధ్య పోటీలా తయారయింది
వైస్సార్సీపీ మేనిఫెస్టో ను మించిన మేనిఫెస్టో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పలేకపోవడం. ఈ యాక్ట్ వల్ల కలిగే నష్టాలను కూటమి ప్రభుత్వం ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళింది కూటమి ప్రభుత్వం
15 ఏళ్ళు కూటమి ఇలాగే ఉంటుంది,అధికారంలో ఉంటుంది అన్న పవన్ కల్యాణ్ గారి మాటలకు రియాలిటీ చెక్ చేద్దాం
ఇక్కడ రెండు విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది కూటమి గెలిచినా, వైస్సార్సీపీ పార్టీ గెలిచినా వీళ్లిద్దరి ఓట్ షేర్ సుమారు 95%. ఈ 95% ఓట్ షేర్ లో, సుమారు 5-8% ఓట్ షేర్ ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. దీని వలన అధికార మార్పిడి జరుగుతోంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని 15 ఏళ్ళు అధికారంలో నిలబెట్టడం, అంటే వైస్సార్సీపీ ని అసీంబ్లీ లో అడుగుపెట్టనీయకపోవడం అనేది కత్తి మీద సాములాంటిది.
ఒక పక్క కార్యకర్తలు, పార్టీ నేతలతో సమన్వయము, పదవులు ఆశించేవారిని బుజ్జగించడం, ప్రజలు అనుకున్న అభివృద్ధి చేసి చూపించడం, ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, అమరావతిని నిర్మించడం, పోలవరం పూర్తి చేయడం, ఉద్యోగాల కల్పన వంటి విషయాల లను బట్టి కూటమి ప్రభుత్వం ఎన్నేళ్లు అధికారంలో ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండాలి ఈ 15 ఏళ్ళు.
కూటమిలో ఏదైనా తప్పు జరిగినా, హామీలు నెరవేర్చలేకపోయిన, ఆశించిన అభివృద్ధి జరగక పోయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు & కో ని ప్రశ్నించగలరా, స్వపక్షంలో విపక్షంగా ఉండగలరా అనేది పెద్ద ప్రశ్న. చంద్రబాబు ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని అసాధ్యమైన హామీలు ఇచ్చారని వైస్సార్సీపీ పార్టీ కి చంద్రబాబు తో పోట్లాడి ఆ హామీలన్నీ నెరవేరేలా చేయగలరా పవన్ కల్యాణ్. అంతే కాకుండా పవన్ కల్యాణ్ ని నమ్ముకుని, జనసేన జెండా పట్టుకున్న వారందరిని పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు బుజ్జగించగలరా. అదే పరిస్థితి తెలుగు దేశంలో కూడా వస్తుంది. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది వచ్చే సారి ఇంకా ఎక్కువ సీట్లు అడగగలరా, అడిగిన సీట్లు చంద్రబాబు ఇస్తారా
వైస్సార్సీపీ మైండ్ గేమ్ లు తట్టుకుని నిలబడుతూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరా. ఎందుకంటె వైస్సార్సీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి పెట్టె ప్రెస్ మీట్ లను ధీటుగా ఎదుర్కోగలరా
జనసైనికులు, అభిమానులు మాత్రం పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు.
లోకేష్ వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ వయసు 53 సంవత్సరాలు. చూద్దాం 90 ఏళ్ళు వచ్చే వరకు చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్ధా లేక పవన్ లేదా లోకేష్ లలో ఎవరికైన అవకాశం వస్తుందా.
2019 లో వైస్సార్సీపీ ఒక్క ఛాన్స్ అని అడిగినప్పుడు ఓటర్లు అవకాశం ఇచ్చారు. 2024 కూటమి ప్రభుత్వం గెలవడానికి ముఖ్య కారణం శ్రీ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అడిగితే ఇచ్చారు ఓటర్లు.
వచ్చే ఎన్నికల నాటికి (2029), మూడు పార్టీ ల పాలన మీద ప్రజలు ఒక అవగాహనకు వస్తారు. ప్రభుత్వానికి అభివృద్ధి అనిపిస్తే చాలదు. ప్రజలకు అభివృద్ధి అనిపిస్తేనే ఓట్లు వేస్తారు
ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి ఎప్పడు ఉంటారు కూటమి ప్రభుత్వం మరచిపోయిన హామీలను ప్రజలలోకి తీసువెళ్లడానికి. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి వైస్సార్సీపీ గట్టి కృషి చేస్తుందనే చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాల అమలుకు సంబంధించి వైస్సార్సీపీ ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.
2024 ఎన్నికల్లో 11 సీట్ లు మాత్రమే గెలుచుకున్న వైస్సార్సీపీ ఓట్ షేర్ సుమారు 40%. అంటే ఇప్పటికి వైస్సార్సీపీ వోట్ బ్యాంకు, గ్రౌండ్ లో స్ట్రాంగ్ గా నే ఉంది
కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూపించకపోయిన, హామీలు అమలు చేయకపోయినా, అవినీతి మరకలు అంటినా రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రత్యామ్యాయ పార్టీ 40% ఓట్ బ్యాంకు ఉన్న వైస్సార్సీపీ పార్టీ మాత్రమే అని కూటమి పెద్దలు గుర్తు పెట్టుకోవాలి
కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు నిజంగా కలిసి ఉంటుందా, కలిసి అధికారం లో ఉంటుందా? ప్రజలు వైస్సార్సీపీ పార్టీ ని మరచి పోయేంతటి అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుందా అనే విషయాలు కాలమే సమాధానం చెప్పాలి

