ఉగాది పచ్చడి (Ugadi Pachadi) లో ఆరు రకాల రుచులు ఉంటాయి. అవి ఏంటంటే తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు. ఉగాది పచ్చడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముందుగా వేప పువ్వు.
చేదు : ఈ ఆరు రుచులలో మొదటగా చేదు కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వుని తినడంవల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ పని తీరుని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది
పులుపు : ఉగాది పచ్చడి లో పులుపు అంటే చింతపండు రసం కలుపుతారు. చింతపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ఆకలిని పెంచుతుంది. మల బద్దకాన్ని తగ్గిస్తుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్లు ఈ చింత పండుకు దూరంగా ఉండాలి
వగరు : ఉగాది కి మామిడికాయలు రావడం మొదలవుతుంది. మొదటి కాపులో వచ్చిన మామిడికాయలలో కాస్త వగరు ఉంటుంది అంతే కాకుండా పులుపుగా కూడా ఉంటాయి. ఈ పచ్చి మామిడికాయలలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాకుండా చర్మ సంరక్షణకు కూడా పని చేస్తుంది
తీపి : ఉగాది పచ్చడిలో తీపి కోసం బెల్లం వాడతారు. ఈ రోజుల్లో పంచదార కన్నా బెల్లాన్ని వాడుతున్నారు చాల మంది. బెల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తీపి కోసం చెరుకు ముక్కలను కూడా ఈ ఉగాది పచ్చడి లో వేసుకోవచ్చు
ఉప్పు : మనం నిత్య జీవితంలో వాడే ఉప్పు. ఉప్పు కండరాలకు బలాన్నివ్వడమే కాకుండా ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువగా తినడం వలన రక్త పోటు వస్తుంది
కారం : ఉగాది పచ్చడి లో కారం కోసం మిరియాల పొడి కలుపుతారు. ఈ మిరియాల పొడి వాడడం వలన రక్త సరఫరా మెరుగు పరుస్తుంది. చలికాలంలో వచ్చే కఫం, వేడి వంటి వాటిని నివారిస్తుంది
వేప పువ్వు విచారాన్ని సూచిస్తే, బెల్లం హ్యాపీ నెస్ ను సూచిస్తుంది. మిరియాలు కోపాన్ని సూచిస్తే, ఉప్పు భయాన్ని సూచిస్తుంది. పులుపు అసహ్యాన్ని సూచిస్తుంది. మామిడికాయ ఆశ్చర్యాన్ని సూచిస్తుంది

