టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ జానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి (Chiranjeevi) ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అయితే నేడు (మార్చి 30) ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ క్రేజీ మూవీని పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ‘మెగా157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుండగా.. ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ అగ్ర కథనాయకుడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెలతో పాటుగా ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీలు అలాగే దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి నటించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా.. ఒక హీరోయిన్ గా అదితిరావు హైదరి ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో డ్యూయెట్స్ లాంటివి ఉండవని, అభిమానులకు చక్కటి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.


