‘అఖండ-2’ – బాలయ్యకు జోడీగా బాలీవుడ్‌ అందాలభామ!

by | Mar 30, 2025 | సినిమా

ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ విద్యా బాలన్ ని ఓ క్రేజీ ఆఫర్‌ వరించిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.. పైగా అది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమా. అదికూడా నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా. వివరాల్లోకెళ్తే.. బాలకృష్ణ కథానాయకుడుగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మధ్య వయసు గల రాజకీయ నాయకురాలి పాత్ర చాలా కీలకమట. గొప్ప నటీమణులు మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విద్యా బాలన్ పేరును సూచించారట దర్శకుడు బోయపాటి. ఆ ప్రపోజల్‌కి బాలకృష్ణ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. ఈ పాత్రకు తగ్గట్టుగా విద్యా బాలన్ ఉంటుందని బాలకృష్ణ భావించడం వల్ల ఆ పాత్ర ఆమెను వరించిందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో బాలకృష్ణ సరసన విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే.

కాగా, అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హిమాలయాల్లో కీలక సన్నివేశాలు షూట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమా కోసం బోయపాటి భారీ సెట్టింగ్స్ ని వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖండ మొదటి భాగం ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఉన్నట్టుగానే శివుడి భారీ విగ్రహం మాదిరిగానే అఖండ 2లో దాన్ని మించేలా భారీ సెట్టింగ్స్ వేయించినట్టుగా తెలుస్తోంది. ఇందులో మురళీకృష్ణగా, అఖండ రుద్రసికిందర్‌ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాను పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌ ఈ మూవీలో అఖండ రుద్ర సికిందర్‌ అఘోరాను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.