‘అదిదా స‌ర్‌ప్రైజు’.. నిజంగానే సర్‌ప్రైజ్‌ చేశారుగా!

by | Mar 28, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరించారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలవగా.. పాజిటివ్ టాక్ తో అన్ని చోట్లా దూసుకుపోతోంది. అయితే విడుదలకు ముందు నుంచే ఈ సినిమాలోని ‘అదిదా స‌ర్‌ప్రైజ్‌’ సాంగ్ పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో కేతికా శర్మ వేసిన స్టేప్పులపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలతో ఇలాంటి అసభ్యకర స్టెప్పులు ఎలా వేయిస్తారంటూ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా రాబిన్‌హుడ్‌ చిత్ర బృందానికి హెచ్చరికలు జారీ చేసింది.

అయితే తెలంగాణ మహిళా కమిషన్ తో పాటుగా పలు మహిళా సంఘాలు సీరియస్ అవడంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. విడుదల తర్వాత మళ్లీ ఎలాంటి వివాదాలు చెలరేగకుండా ‘అదిదా స‌ర్‌ప్రైజ్‌’ సాంగ్ లోని హుక్‌ స్టెప్‌ని తొలగించేశారు. పాటలోని ఈ స్టెప్పులను తొలగిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు కానీ సినిమాలో మాత్రం ఆ స్టెప్పులు పూర్తిగా తీసేశారు. దింతో ‘అదిదా స‌ర్‌ప్రైజ్‌’ సాంగ్ లోని హుక్‌ స్టెప్పులపై ఏర్పడిన వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. కాగా, రాబిన్‌హుడ్‌ చిత్రాన్ని వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా.. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. భీష్మ సినిమా త‌ర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.