IPL : సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం

by | Mar 23, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

287 పరుగుల భారీ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 24 పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయి కష్టాల్లో పడింది.  సన్ రైజర్స్ పేసర్ సిమర్జీత్ సింగ్ ఒకే ఓవర్లో ఓపెనర్ జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ లను అవుట్ చేశాడు.  ఆ తరవాత వచ్చిన నితీష్ రానా కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు.

అయితే ఆ తరవాత వచ్చిన ధృవ్ జురెల్, సంజు శాంసన్ లు నాలుగవ వికెట్ కు 111 పరుగులు జోడించారు. ముఖ్యంగా ధృవ్ జురెల్ చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేశాడు.  సంజు శాంసన్ కేవలం 37 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు

జట్టు స్కోర్ 161 పరుగుల వద్ద ధృవ్ జురెల్, సంజు శాంసన్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం ఖాయమైంది.

సిమ్రాన్ హేట్మేయర్, శుభమ్ దూబే లు ధాటిగా ఆడిన అప్పటికే ఛేదించాల్సిన లక్ష్యం కొండంత ఉండడంతో పరిస్థితి చేజారిపోయింది.  సిమ్రాన్ హేట్మేయర్ 23 బంతుల్లో 42 పరుగులు, శుభమ్ దూబే 11 బంతుల్లో 34 పరుగులు చేశారు.   

చివరకు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ లు నష్టపోయి 242 పరుగులు చేయగలిగింది

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ లు రెండేసి వికెట్లు తీయగా, షమీ, ఆడమ్ జంపా లు చెరో ఒక వికెట్ తీశారు 

అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్  ఫీల్డింగ్ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది

సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే బాదుడుకు మరో పేరు.  ఓపెనర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన ఇషాన్ కిషన్ తో జత కలిసిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారీ స్కోర్ లక్ష్యంగా బాదడం మొదలు పెట్టారు. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ లు రెండవ వికెట్ కు 85 పరుగులు జోడించారు. 31 బంతుల్లో, 3 సిక్సర్లు, 9 ఫోర్ల  సాయంతో 67 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ మూడవ వికెట్ కు ధాటిగా ఆడుతూ 72 పరుగులు జోడించారు.  నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఇషాన్ కిషన్ కు మరో పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ జత కలిశాడు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 56 పరుగులు జోడించారు.  క్లాసెన్ 14 బంతుల్లో 34 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు  

వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల పై విరుచుకుపడి 47 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  ఈ ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి.  ఇషాన్ కిషన్ కు ఇదే ఐపీల్ లో మొదటి సెంచరీ. ఐపీల్ 2025 లో కూడా మొదటి సెంచరీ  

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మన్, మానవత్వం మరచిపోయి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ని చీల్చి చెండాడారు. ఎంతలా అంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆర్చర్ 4 ఓవర్ల లో 76 పరుగులు, ఫారూఖీ 3 ఓవర్ల లో 49 పరుగులు సమర్పించుకున్నారు.  అయినా వీరిద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేదు

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో  తుషార్ దేశ్ పాండే మూడు వికెట్ లు తీయగా, తీక్షణ రెండు వికెట్లు , సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు