‘స్పిరిట్’లో ప్రభాస్‌కి అన్నయ్యగా సంజయ్!

by | Mar 23, 2025 | సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతున్న హై వోల్టేజ్ చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథ రీత్యా ప్రభాస్ (Prabhas) అన్నయ్య పాత్ర కీలకంగా ఉండనుందట. అయితే ఆ పాత్రలో బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సంజయ్‌దత్‌ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంజయ్‌ దత్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌కి (Prabhas) అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్‌ రెడ్డి. ఈ పాత్ర కోసం దర్శకుడు సందీప్ ఇటీవల సంజయ్‌దత్‌ను సంప్రదించారట. కథ విని సంజయ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ సినిమాను మేకర్స్ పాన్‌ఇండియా స్థాయిలో నిర్మిస్తుండటంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కథ కూడా డిమాండ్‌ చేయడంతో సంజయ్‌దత్‌ని తీసుకోబోతున్నారని తెలుస్తున్నది. ఇందులో ప్రభాస్, సంజయ్‌ దత్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయని చిత్ర యూనిట్ అంటున్నారు.

ఇదిలాఉంటే.. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’, మూవీ హను రాగవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ” సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ‘స్పిరిట్'(Spirit) మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఉగాది రోజున ఈ సినిమాను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా వెంటనే షూటింగ్ ప్రారంభించాలని భావించిన సందీప్ రెడ్డి ఉగాదికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.