‘కోర్ట్’ నచ్చకుంటే ‘హిట్ 3’ చూడకండి.. నాని సంచలన కామెంట్స్

by | Mar 8, 2025 | సినిమా

వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగానూ ఓ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. నాని (Nani) సమర్పణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కోర్ట్’ (Court). స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మిస్తుంది. శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా హొలీ కానుకగా మార్చి 14న విడుదల కానుండగా, తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో నాని(Nani) తో పాటు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్‌ వర్మ, శ్రీకాంత్‌ ఓదెల(Srikanth Odela), శైలేశ్‌ కొలనుతో పాటుగా కోర్ట్ చిత్రబృందం పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘కోర్ట్‌’ మూవీ గురించి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ” నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16ఏళ్లు అయింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఈ సినిమా చూడండి అంటూ నేను అడగలేదు. కానీ మొదటిసారిగా అడుగుతున్నాను ఈ కోర్ట్ సినిమాను చూడండి. ఈ మాట ప్రొడ్యూసర్ గా చెప్పడం లేదు. సినీ ప్రేమికుడుగా చెబుతున్నా. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా ఇప్పటి వరకూ రాలేదు. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడండి. ‘కోర్టు’ మూవీ కంటే ‘హిట్ 3’ (HIT 3) మీద ఎక్కువగా ఖర్చుపెట్టాను. ఒకవేళ మీకు కోర్ట్ మూవీ నచ్చకపోతే నా ‘హిట్3’ మూవీని ఎవరూ చూడకండి. ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్నా అర్థం చేయానుకోండి. కోర్ట్ మూవీ చూసాక థియేటర్ల నుండి ఎమోషనల్ అవుతూ వస్తారు.” అంటూ నాని చెప్పుకొచ్చారు.

కాగా, కోర్ట్ (Court) ట్రైలర్ బట్టి చూస్తే.. తన కూతురితో ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి.. ఓ యువకుడిపై పోక్సో కేసు పెడతాడు. ఆ యువకుడు 78 రోజుల పాటు జైల్లో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో లాయర్ ప్రియదర్శి ఈ కేసు వాదించేందుకు సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది.