బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఛావా తెలుగు వర్షన్‌ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
అయితే ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ముస్లీం ఫెడరేషన్ నాయకులు తాజాగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఛావా మూవీని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మూవీ కారణంగా నార్త్ లో మత ఘర్షణలు చెలరేగాయని, ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి గొడవలు జరిగే అవకాశం ఉందని కాబట్టి ఈ సినిమా రిలీజ్ కాకుండా చూడాలని ఏపీ ముస్లీం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఛావా తెలుగు వెర్షన్ విడుదలకు ముందు హీరో విక్కీ కౌశల్ తెలుగు అభిమానులకు ప్రత్యేక సందేశం అందించాడు. ఛావాని ఇంతలా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే తెలుగు ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని కోరడం సంతోశానిచ్చింది. మార్చి 7న ఈ సినిమా తెలుగులో మీ ముందుకు రానుంది. మరాఠా యోధుల పోరాట చరిత్ర మీ మనసుల్ని హత్తుకుంటుంది అని బావిస్తున్నాను అంటూ విక్కీ కౌశల్ పేర్కొన్నారు.

