పవన్ ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడనుందా… కారణం ఇదే!

by | Mar 1, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, హరిహరవీరమల్లు మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా… చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు.

ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ‘మ్యాడ్ స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్‌పై స్పష్టతనిచ్చారు. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా
‘మ్యాడ్ స్క్వేర్‌’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది కదా.. మార్చి 29న ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీను ఎలా రిలీజ్ చేస్తున్నారంటూ ప్రశ్నించగా.. ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతున్నట్లు నాకు సమాచారం లేదు. ఒక వేళ అదే తేదీన హరిహర వీరమల్లు మూవీ విడుదలైతే తప్పకుండా మా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ రిలీజ్ వాయిదా వేస్తాం అని అన్నారు. అయితే నిర్మాత నాగవంశీ హరిహర వీరమల్లు మూవీ విడుదలపై తనకు సమాచారం లేదనడంతో అసలు ప్రకటించిన తేదీకి పవన్ కళ్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అనేది అనుమానంగా మారింది.