మహా శివరాత్రి స్పెషల్ : ద్వాదశ జ్యోతిర్లింగాలు

by | Feb 25, 2025 | ప్రగడ టీవీ

మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగాల పై స్పెషల్ వీడియో చూడండి

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా పుట్టాయో తెలుసా ?

ప్రతి శివుడి క్షేత్రానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ప్రతి క్షేత్రానికి విశిష్టత ఉంటుంది. దీనినే

సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లిఖార్జునమ్,

ఉజ్జయిన్యాం మహాఖాళం, ఓంకారం అమరేశ్వరం

వైద్యనాథం చితాభూమౌ, ఢాకిన్యాం భీమశంకరం

సేతు బందేచ రామేశం, నాగేశం దారుకావనే,

వారణాశ్యాంతు విశ్వేశం, త్ర్యంబకే గౌతమీతటే,

కేదారం హిమవత్ పృష్టే, ఘృశ్మేశం శివాలయే,,,

ద్వాదశైతాని నామాని, ప్రాతరుత్థామయః పఠేత్

సర్వపాప వినిర్ముక్తః సర్వి సిద్ధి ఫలం లభేత్

ఇలా ఒక్కో క్షేత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈవీడియోలో చూద్దాం.. 

సోమనాథలింగం.

12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా వర్ణించబడింది. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రములోని ప్రభాసపట్టణానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఉన్నది. విజయవాడ నుండి ఖాజీపేట, సికింద్రాబాద్, కురిదివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్లమీదుగా వెరావల్ స్టేషన్లో దిగాలి. వెరావల్ రైల్వేస్టేషన్ నుండి 7 కి.మీ. దూరంలో వున్న సోమనాథ్ క్షేత్రానికి బస్సుద్వారా కూడా వెళ్ళవచ్చు.

ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్ఠింపబడిందని చెబుతారు.

కృష్ణ పక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగానూ, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్థమానం అయ్యేటట్లు, పూర్ణిమనాటికి కళాపరిపూర్ణుడుగా విరాజిల్లే వరాన్ని ఇక్కడ చంద్రుడు పొందాడని చెప్తారు. సోమనాధలింగంగా కొలువై ఉన్న ప్రభాస క్షేత్రం అందరూ దర్శించుకోవాల్సినదిగా చెప్తుంటారు.

మల్లికార్జున లింగం

12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండటం వలన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న శ్రీశైలమహాక్షేత్రంలో యుగయుగాలనుండి స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలోని అన్ని ప్రధాన కూడలుల నుండీ నేరుగా బస్సులున్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి, నిలయమైన యీ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై విరాజిల్లుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీసమేతుడై, శ్రీశైలనాధుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై యీ క్షేత్రంలో కొంతకాలము గడిపి స్వామిని సేవించి, లింగాలను ప్రతిష్ఠించారని చెప్తారు.

మహాకాళేశ్వర లింగం:

మాలవ దేశంలోని ఉజ్జయిని పట్టణంలో శిప్రానది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఉజ్జయిని నగరాన్నే అవంతి అని కూడా అంటారు. విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే మార్గంలో ఉజ్జయిని రైల్వేస్టేషన్ వుంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు 5 గంటల కాలం ప్రయాణించి ఉజ్జయినిని చేరుకోవచ్చు.

ఇదే దారిలో ప్రయాణించేవారు ఇన్డోర్ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇన్డోర్ నగరం ఒకప్పుడు రాణి అహాల్యాబాయ్ నివాసస్థలం. ఇన్డోర్ నగరం ఉజ్జయినికి 53 కి.మీ. దూరంలో వుంది. శ్రీ మహాకాళ లింగమును సేవించి వేదప్రియుడు, శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైనవారు శివసాన్నిద్యాన్ని పొందారని చెప్తారు. మహిమాన్వితమైన మహేకాళేశ్వర లింగాన్ని ఒక్కసారైనా దర్శించుకుని తీరాల్సేందే.

ఓంకారేశ్వరుడు

ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. మాంధాత తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడంటారు. నర్మదా నదీ తీరంలో శివుడు ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఓంకారేశ్వరుని అమరేశ్వరుడని, అమలేశ్వరుడని కూడా పిలుస్తారు.  కానీ ఇక్కడ నర్మదానదికి రెండువైపుల ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. వాటిమధ్య నర్మదానదిమీద వంతెన కూడా నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నర్మదానది, నర్మద, కావేరిక అని రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండుపాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని ‘ శివపురి ‘ అని ‘ మాంధాతృపురి ‘ అని పిలుస్తారు.

బైద్యనాథేశ్వరుడు

ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం రావణాసురుడు తన పదితలలనూ తెగనరుక్కోవడంతో ఈశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి, ఆ తలలన్నింటినీ అతికించడం వల్ల ఈయనకు వైద్యనాథేశ్వరుడని పేరు వచ్చింది. ఔరంగాబాద్ నుంచి 12 గం|| ల కాలం బస్సులో ప్రయాణించి పర్లివైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వేజంక్షన్ నుంచి 40 కి.మీ. దూరం రైలులో ప్రయాణించి పర్లివైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు.

భీమశంకర లింగం :

సహ్య పర్వతం యొక్క శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు  ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం. మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఈ భీమశంకర ఆలయం ఉంది. భీముడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీనికి భీమశంకర లింగం అని పేరు వచ్చిందని ప్రతీతి.

రామేశ్వరుడు

తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ రామేశ్వరంలో కొలువై ఉన్న లింగమే అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి పొందింది. రాముడు ప్రతిష్టించి సేవించినందు వల్ల ఈ లింగానికి రామేశ్వర లింగమని పేరు. విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా రైలులో వెళ్ళవచ్చు.

నాగేశ్వరుడు

గుజరాత్లోని ద్వారకలో కొలువై ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాచీనమైనదిగా విశ్వసిస్తారు. నాటి దారుకావన మే నేటి ద్వారక. శివపురాణంలో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించిన వారి సర్వకష్టాలనూ నివారిస్తానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా మారిపోయాడంటారు.  గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే బొంబాయినుండి అహ్మదాబాద్, సోమనాథ్, జూనాగఢ్ మీదుగా ద్వారాకచేరి అక్కడ నుండి 22 కి.మీ దూరంలో ఉన్న నాగేశ్వరాలయానికి సముద్ర ప్రయాణం చేసి దారుకావనంలో దిగి ‘గోపీ తలాబ్’ వెళ్ళే బస్సులో నాగ్నాథ్ వద్ద దిగాలి. జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రమునుండి 7 గంటల కాలం బస్సులో ప్రయాణించి ద్వారకను చేరుకోవచ్చు.ద్వారకలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాగ్నాథ్, ద్వారకకు 22 కి.మీ దూరం కాగా భేట్ ద్వారక 32 కి.మీ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగ్నాథ్ ఆలయమే అతి చిన్న ఆలయం.

విశ్వేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అంటే కాశీలో గల కాశీవిశ్వనాథుడికి ఉన్న ప్రాశస్త్యం మరే లింగానికీ లేదంటే అతిశయోక్తి కాదు. శివుడికి కాశీనగరమంటే ఈశ్వరుడికి ఎంత ప్రీతి అంటే, తనకు భిక్ష దొరకలేదని అలిగిన వ్యాసుడు ఆ నగరాన్ని శపించడానికి సిద్ధపడేసరికి అమితంగా ఆగ్రహించి, వ్యాసుడినే నగరం నుంచి వెళ్లగొట్టాడట. అత్యంత పురాతన నగరమైన కాశీకి మహాశ్మశానమని పేరు. ఇక్కడి అమ్మవారు విశాలాక్షి. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కాశీవిశ్వనాథుడిని సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని, కాశీలో మరణించిన వారికి అంత్యసమయంలో శివుడే స్వయంగా తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచీ కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు సదుపాయాలున్నాయి. విజయవాడ, హైద్రాబాద్ నుంచి ఈ క్షేత్రం వెళ్ళేవారు కాజీపేట నాగపూర్, ఇటార్సీ, అలహాబాద్ మీదుగా వెళ్ళవలసి వుంటుంది.

త్య్రంబకేశ్వరుడు

మహారాష్ట్రలోని నాసిక్ వద్దగల త్రయంబకేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. తమకు జ్ఞానబోధ చేసిన ఈశ్వరుడిలో బ్రహ్మ, విష్ణువులు ఐక్యం అయిపోవడం వల్ల ముగ్గురూ కలిసి త్య్రయంబకేశ్వర లింగంగా ఆవిర్భవించారు.

పరమ పావనమైన గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఈ గోదావరికి గౌతమి అని పేరు. త్య్రంబకేశ్వరుని సేవించిన వారికి సకల విద్యలు అబ్బుతాయట. మోక్షం లభిస్తుందట.  మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి బొంబాయి నగరం నుండి నాసిక్ వరకు 184 కి.మీ.లు రైలులో ప్రయాణించి అక్కడి నుండి 30 కి.మీ. బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరవచ్చు.

కేదారనాథుడు

ఉత్తరాఖండ్లో హిమాలయాల వద్ద మందాకినీ తీరాన ఉంది. ఏటా అక్షయ తృతీయ మొదలుకొని కార్తిక పూర్ణిమ వరకు మాత్రమే కేదార్నాథ్లోని ఆలయం భక్తుల కోసం తెరుచుకుని ఉంటుంది. ఆ తర్వాత శీతాకాలంలో ఆరునెలల పాటు ఇక్కడి విగ్రహాలను ఉఖిమఠానికి తరలించి, అక్కడ పూజపునస్కారాలను కొనసాగిస్తారు. పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఆ తర్వాత ఆది శంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారని చెప్తారు. ఉత్తరప్రదేశ్లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడనుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుండి 280 కి.మీ బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకనగానీ డోలీలలో గానీ పొట్టి గుఱ్ఱాలపై గానీ 14 కి.మీ.లు ప్రయాణించి కేదరనాథ్ను చేరాలి.

ఘృష్ణేశ్వరుడు

మహారాష్ట్రలోని దౌలతాబాద్లో ఉన్న ఈ ఆలయం శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో చెప్పిన చిట్టచివరి ద్వాదశ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. ఘృష్ణేశ్వర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల వెరుల్లో ఉంది ఈ ఆలయం. ఘృశ్నే అనే భక్తురాలి కోరిక మేరకు శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా అవతరించినందువల్ల ఈయనకు ఘృష్ణేశ్వరుడని పేరు వచ్చింది. ఘృష్ణేశ్వరుని సేవించిన వారికి సంతాన నష్టం, అకాల మృత్యువు ఉండవని విశ్వాసం. ఈ క్షేత్రానికి చేరటానికి ఔరంగాబాద్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. స్థానికులచే “వెరూలా”గా పిలువబడే ఈ క్షేత్రం ఔరంగాబాదుకు 8 కి.మీ.లు ఇది చిన్నగ్రామం అయినందువల్ల యాత్రికుల వసతికి ఏర్పాట్లు అంతగా లేవు.  ఈ లింగాన్ని దర్శించుకున్నవారికి అకాలమరణం కానీ, పుత్రవియోగం కానీ ఉండదని చెప్తుంటారు.