‘హను-మాన్’ (Hanuman) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) . ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’(Mirai) . ‘సూపర్ యోధ’ ఉపశీర్షిక. ఇక మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించారు. కానీ అవుట్ ఫుట్ విషయంలో సంతృప్తి చెందని మేకర్స్ తాజాగా సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
‘మిరాయ్’ మూవీని 8 భాషల్లో ఆగస్టు 1, 2025న 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేయగా.. హీరో తేజ సజ్జా మంచు కొండల మధ్య, చేతిలో తన ఆయుధాన్ని పట్టుకుని సీరియస్ లుక్ లో ఉన్నారు. మరోవైపు ‘మిరాయ్’ (Mirai) సినిమా రిలీజ్ కు ముందే అదిరిపోయే బిజినెస్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.30 కోట్లకు దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా, ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj) నెగిటివ్ పాత్రలో కనిపిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడిగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించనున్నారు.

