చిరు – అనిల్‌ రావిపూడి మూవీ.. బ్లాక్‌బస్టర్‌ కోసం భారీ స్కెచ్!

by | Feb 18, 2025 | సినిమా

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్‌ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల నానితో ‘ది పారడైజ్‌’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే చిరంజీవితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ‘విశ్వంభర’ మూవీ చిత్రీకరణ పూర్తవగానే మెగాస్టార్ అనిల్‌ రావిపూడి సినిమా సెట్‌లో జాయిన్ అవనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న అనిల్‌ రావిపూడి.. తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిరంజీవితో సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ నాలుగు పాట‌ల‌కు సంబంధించి కంపోజింగ్ కూడా పూర్తి చేసాడ‌ని స‌మాచారం. చిరు డాన్స్ గ్రేస్ కు అనుగుణంగా అదిరరిపోయే భాణీలను భీమ్స్ అందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ లో కూడా భీమ్స్ అందించిన మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుండగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారికి ప్రకటన వచ్చే అవకాశముంది.