మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘లైలా’. దర్శకుడు రామ్ నారాయణ్ రూపొందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్లపాటి నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్లాప్ మూవీగా లైలా నిలిచిపోయింది. ఫిబ్రవరి 14న విడుదలైన లైలా మూవీ ఇప్పటి వరకు కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది
తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ వీకెండ్ లో అయినా బాక్సాఫీస్ వద్ద పుంజుకుంటుంది అని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఉహించనిరీతిలో శని, ఆది వారాల్లో ఈ సినిమా షోలు చాలా చోట్ల రద్దయ్యాయి. దీంతో లైలా మూవీ మళ్లీ కొలుకోలేకపోయింది. లైలా మూవీ నిర్మాతకు సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న విశ్వక్ సేన్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.
నిజానికి ‘లైలా’ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

