‘హరిహరవీరమల్లు”లో అలా ఉండబోతుందా.?

by | Feb 18, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు.

ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్​తో పుర్తయ్యేందుకు సిద్ధవుతోంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీలోని రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘హరిహరవీరమల్లు’ చిత్ర యూనిట్ రెండో సాంగ్ పై అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ లోని ‘కొల్లగొట్టిందిరో..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక అప్‌డేట్ హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ‘గురు’ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘తేరే బినా’ మాదిరిగా ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో పవన్‌ కల్యాణ్‌, నిధి అగర్వాల్‌ మీద ఈ సాంగ్ ను హైదరాబాద్ లోని ఓ ప్యాలెస్‌లో ఐదు రోజులపాటు చిత్రీకరించినట్లు సమాచారం. దాంతో విడుదలకు ముందే ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ పై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. కాగా, మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28న తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.