‘లైలా’ సినిమా రివ్యూ: లైలా, ఏంటి గోల

by | Feb 14, 2025 | సినిమా రివ్యూ

విడుదల తేది: 14–2–2025
నటీనటులు: విశ్వక్‌సేన్‌, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: సాగర్ దాడీ
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్ బ్యానర్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్‌ నారాయణ్‌

టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్‌ ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా.. ఇందులో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ లలో లేడీ గెటప్ లో కనిపించి విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు విశ్వక్ సేన్. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ ఆడియన్స్ ను ఎలా మెప్పించారు? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

సోను మోడల్(విశ్వక్ సేన్) ఓల్డ్ సిటీలో తన తల్లి ఇచ్చిన బ్యూటీ పార్లర్ న‌డుపుతుంటాడు. అమ్మాయిలంతా సోనూతో మేక‌ప్ వేయించుకోవాల‌ని, అందంగా మెరిసిపోవాల‌ని ఆశ ప‌డుతుంటారు. పార్ల‌ర్‌కి వ‌చ్చిన‌వాళ్లంద‌ర్నీ అక్కా, చెల్లి అని ప్రేమ‌తో పిలుస్తూ సోనూ వాళ్ల క‌ష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే జిమ్ ట్రైనర్ అయిన జెన్నీ (ఆకాంక్ష శర్మ)తో పీకల్లోతు ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా పార్ల‌ర్‌కి వచ్చిన ఒకరికి ఆర్థిక స‌హాయం చేసి క‌ల్తీ నూనెల స్కామ్ లో ఇరుక్కొంటాడు. దాంతో పాటుగా ఎస్సై శంకర్(బబ్లూ పృథ్వీరాజ్)కి శత్రువు అవుతాడు సోను. మరోవైపు ఓల్డ్‌ సిటీలోనే మేకల బిజినెస్‌ చేసే రుస్తుం(అభిమన్యు సింగ్‌) కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా సోను లేడి గెటప్ వేయాల్సి వస్తోంది. అసలు సోను ఎందుకు అమ్మాయి గెటప్ వేయాల్సి వచ్చింది ?, ఇంతకీ సోను ఆయిల్ స్కామ్ నుండి బయటపడ్డాడా ? జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఎలా సాగింది? సోనుగా చేయలేనివి లైలాగా మారి చేశాడా ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

‘లైలా’ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైలా చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫన్ రొమాంటిక్ జానర్​లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో అభిమానుల్ని అలరించాడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో పండించిన కామెడీ కడుపుబ్బా నవ్వించింది. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ అందాల ఆరబోత చేస్తూ జెన్నీ పాత్రలో ఆకట్టుకుంది. రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్‌ అలరించాడు. జేమ్స్‌ లియోన్‌ సంగీతంతో పాటుగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. లైలా ఎంట్రీతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా ఈ సినిమా తక్కువ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
విశ్వక్ సేన్ నటన,
కామెడీ,
కొన్ని మలుపులు

మైనస్‌ పాయింట్స్‌:
కొత్తదనం లేని కథ, కథనం
బలం లేని భావోద్వేగాలు

రేటింగ్: 2/5