‘బ్రహ్మాఆనందం’ సినిమా రివ్యూ: బ్రహ్మానందమే

by | Feb 14, 2025 | సినిమా రివ్యూ

విడుదల తేది: 14–2–2025
నటీనటులు: బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, దివిజ ప్రభాకర్, సంపత్ రాజ్, రఘుబాబు తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పిసపాటి
ఎడిటింగ్‌: ప్రణీత్ కుమార్
నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకత్వం: ఆర్‌వీఎస్‌ నిఖిల్

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రల్ని పోషించారు. ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి ఎలా మెప్పించారు? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం – రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు. చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రహ్మానందం (రాజా గౌతమ్) థియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తుంటాడు. నాకోసం నేను అనే స్వార్థంతో బ్రతికే బ్రహ్మానందం ఎప్పటికైనా పెద్ద నటుడు అవ్వాలనే కోరికతో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ మిత్రుడు గిరి (వెన్నెల కిషోర్) సాయంతో జీవితాన్ని వెళ్ళదిస్తుంటాడు. మరోవైపు బ్రహ్మానందం తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం రాసిన నాటకం జాతీయ స్థాయిలో థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో ఎంపికవుతుంది. దానికి డిపాజిట్ కింద రూ. 6 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం బ్రహ్మనందం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం తాత ఆనంద్ రామ్మూర్తి తన దగ్గర భూమి ఉందని తాను చెప్పినట్టు చేస్తే ఆ రూ.6 లక్షల డబ్బులు తాను ఇస్తానంటాడు. దాంతో బ్రహ్మానందం, ఆనంద్ రామ్మూర్తి ఇద్దరూ తమ సొంత ఊరికి వెళతారు. అక్కడికి వెళ్ళాక ఇంటర్వెల్ కి ముందు ఆనంద్ రామ్మూర్తి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో సినిమా మలుపు తిరుగుతుంది. ఆ ఊహించని ట్విస్ట్ తో బ్రహ్మానందం ఊరిలోనే చిక్కుకుపోవడం, ఆనంద్ రామ్మూర్తి కోసం బ్రహ్మానందం ఏం చేసాడు, ప్రేమించిన అమ్మాయ బ్రహ్మానందానికి దక్కిందా అనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమాలో తాత, మనవడు పాత్రల్ని నిజజీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ పోషించడం వల్ల సినిమా విడుదలపై ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో బ్రహ్మానందం నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై నడిపించిన ఆయన ఓ పక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించారు. అలాగే బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతకుముందు హీరోగా కొన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కించుకోని రాజా గౌతమ్ ఈ సినిమాలో తన మార్క్ చూపిస్తూ తనలో పరిపూర్ణమైన నటుడిని బయటికి తీశారు. ఈ సినిమాతో నటుడిగా ఆయన మరో మెట్టు ఎక్కేశారు. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో నటించిన వెన్నెల కిషోర్ ఈ దులో గిరి అనే పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వెన్నెల కిషోర్, రాజా గౌతమ్‌ల మధ్య సీన్లు బాగా పండాయి. హీరోయిన్ గా నటించిన ప్రియా వడ్లమాని, దివిజ పాత్రలు ఇలా కనిపించి అలా మాయమైపోయాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా కామెడీతోనే నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో నవ్విస్తూనే కాస్త ఏడిపించాడు. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తుంది. మొత్తంగా మరిచిపోతున్న మానవ సంబంధాలను ఈ సినిమాలో దర్శకుడు సున్నితంగా సృశించే ప్రయత్నం చేశాడు. ఇక మితేష్ పర్వతనేని సినిమాటోగ్రఫీ బాగుంది. శాండిల్య పిసపాటి, తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కథలో ట్విస్టులు లేకుండా సాగడం, ఎమోషన్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, క్లైమాక్స్ ముందుగానే ఊహించడంతో ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. మొత్తానికి ‘బ్రహ్మా ఆనందం’ మూవీ సమాజానికి మంచి సందేశంతో పాటు వినోదాన్ని అందించింది.

ప్లస్ పాయింట్స్:
బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ నటన,
కామెడీ, నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌:
సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు,
కొరవడిన భావోద్వేగాలు
నెమ్మదిగా సాగే కథ

రేటింగ్: 2.75/5