ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం ; సిరీస్ కైవసం

by | Jan 31, 2025 | వార్తలు

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య పుణె లో జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో,, భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, 3-1 తో సిరీస్ ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్ ల నష్టానికి 181 పరుగులు చేసింది

మహమూద్ వేసిన ఇన్నింగ్స్ రెండవ ఓవర్ లో భారత జట్టు మూడు వికెట్ లను కోల్పోయింది. సంజు శాంసన్ 1 పరుగు చేసి అవుట్ అవ్వగా, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డక్ అవుట్ అయ్యారు

ఆ తరవాత రింకు సింగ్, అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే అభిషేక్ శర్మ 29 పరుగుల వద్ద, రింకు సింగ్ 30 పరుగుల వద్ద అవుట్ అయ్యారు

79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టును శివమ్ దూబే, హార్దిక్ పాండ్య ఆదుకున్నారు.  వీరిద్దరూ ఆరవ వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఇద్దరు చెరో 53 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో మహమూద్ మూడు వికెట్లు, ఓవర్తన్ రెండు వికెట్లు తీయగా, కార్స్, రషీద్ చెరో వికెట్ తీశారు

అనంతరం 182 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు డకెట్, సాల్ట్ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. సాల్ట్ 23 పరుగులు,  డకెట్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొదటి సారి హారీ బ్రూక్ 26 బంతుల్లో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  మిగతా బ్యాట్స్ మాన్ ఇలా వచ్చి అలా వెళ్లారు.

భారత బౌలర్లలో బిష్ణోయ్, హర్షిత్ రానా మూడేసి వికెట్లు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. ఒకే ఓవర్ లో రెండు వికెట్ లు తీసి వరుణ్ చక్రవర్తి మ్యాచ్ ను మలుపు తిప్పాడు.  కీలక సమయాలలో వికెట్లు తీసిన హర్షిత్ రానా భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు