‘వారణాసి’లో మరో స్టార్ హీరో.. రాజమౌళి స్కెచ్ అదుర్స్!

by | Feb 20, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S S Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). మహేశ్‌బాబు ఇందులో రుద్ర (Rudra) అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కనిపించనున్నారు. ఇక కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహేశ్ బాబు గెటప్ కూడా మరీ డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. కాగా, ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర ఉంద‌ని.. అందులో స్టార్ హీరో క‌నిపించ‌బోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో ఒక కీల‌క పాత్ర ఉంద‌ని.. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చాను (Kicha Sudeep) సంప్ర‌దించిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. రాజమౌళి సినిమా కావ‌డంతో సుదీప్ కిచ్చా కూడా మ‌రో మాట లేకుండా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విలన్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాల తర్వాత మరోసారి సుదీప్‌కు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం దక్కనుంది. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుల్లో సుదీప్ కిచ్చా పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన ప్రతిభతో శాండిల్‌వుడ్‌లో అగ్రనటుడిగా ఎదిగిన సుదీప్ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.