ప్రశాంత్‌ వర్మ-ప్రభాస్‌ మూవీ లేనట్టేనా.. క్లారిటీ వచ్చేసిందిగా!

by | Feb 20, 2026 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారారన్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేస్తుండగా.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit) , నాగ్ అశ్విన్ తో ‘కల్కి-2’ (Kalki 2) , ప్రశాంత్ నీల్ తో ‘సలార్-2’ చిత్రాలు చేయనున్నారు. అలాగే, ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్‌ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి ‘బకా’ (Bakaa) టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేసినట్టు టాక్‌ వినిపిస్తోంది. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన టెస్ట్‌ షూట్‌ కూడా పూర్తయినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు డేట్స్ కేటాయిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ – ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న సినిమా క్యాన్సిల్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా నిజంగానే ఆగిపోయిందా అని సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వార్తలపై స్వయంగా ప్రశాంత్ వర్మ స్పష్టత ఇచ్చారు. ప్రభాస్‌తో సినిమా ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తాయని అన్నారు. ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్లే తమ ప్రాజెక్ట్ మొదలవలేదని పేర్కొన్నారు. అంతే తప్ప తమ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. త్వరలోనే ప్రభాస్ (Prabhas) తో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ ముగింపుకు చేరుకుంది. ఆపై సందీప్‌ రెడ్డి ‘స్పిరిట్‌’, ‘కల్కి-2’ సినిమాలు చేయనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత, ప్రభాస్ – ప్రశాంత్ వర్మల కాంబోలో రానున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇక మరోవైపు పానిండియా బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’కి సీక్వెల్‌గా దర్శకుడు ప్రశాంత్‌వర్మ ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘కాంతారా’ఫేం రిషబ్‌శెట్టి ఇందులో ఆంజనేయునిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.