రివ్యూ: విశ్వక్ ‘ఫంకీ’ కామెడీ డ్రామా మెప్పించిందా.?

by | Feb 13, 2026 | సినిమా రివ్యూ

విడుదల తేది: 13–02–2026
నటీనటులు: విశ్వక్‌సేన్‌, కయాదు లోహర్‌, నరేష్‌, మిర్చి సంపత్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: సురేష్ సారంగం
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్‌ (Sithara Entertainments)
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య (Nagavamsi)
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనుదీప్ కేవీ (Anudeep)

టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) ప్రస్తుతం’ ఫంకీ’ (Funky) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్న సంగతి తెలిసిందే. లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ చిత్రానికి ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ క‌యాదు లోహ‌ర్ కథానాయికగా నటిస్తోండగా.. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రోమో, సాంగ్స్, అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని శ్రీక‌ర స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగవంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనుదీప్, తనదైన గ్రేస్ తో ఆకట్టుకునే విశ్వక్ సేన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఏ స్థాయిలో మెప్పించింది అనేది ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

ఇండస్ట్రీలో కోమల్‌(విశ్వక్‌సేన్‌) అనే కొత్త దర్శకుడు తన మొదటి సినిమా చేస్తుంటాడు. రూ.4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌(నరేశ్‌)కు హామీ ఇవ్వగా.. చివరకు రూ. 40 కోట్లు అవుతుంది. అయినా కూడా సినిమా పూర్తికాకపోవడంతో నిర్మాత సుదర్శన్‌ అనారోగ్య పాలవుతాడు. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కుమార్తె చిత్ర(కయాదు లోహర్‌) తీసుకుంటుంది. తన తండ్రికి ఎలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన కోమల్‌పై చిత్ర(కయాదు లోహర్‌)కి విపరీతమైన కోపం ఉంటుంది. మిగిలిన సినిమాను తాను చెప్పిన బడ్జెట్‌లో కాకుండా కేవలం కోటి రూపాయల్లో పూర్తి చేయాలనే నిబంధన పెడుతుంది చిత్ర. ఈ జర్నీలోనే కోమల్‌, చిత్ర మధ్య ప్రేమ ఏర్పడుతుంది. మరి కోమల్‌ అనుకున్న ఈ సినిమాను పూర్తి చేయగలిగాడా? చిత్రతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? అనేదే ఈ సినిమా మిగతా కథ.

విశ్లేషణ:

‘జాతి రత్నాలు’ సినిమా తర్వాత తర్వాత అనుదీప్‌ సినిమా వస్తుందంటే అభిమానులు ముందే ఒక అంచనాకు వచ్చేసి ఉంటున్నారు. కథ లేకున్నా కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో సినిమాను నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. ఫంకీ చిత్రాన్ని కూడా అనుదీప్‌ కేవలం నవ్వించడానికే తీసినట్టు అనిపిస్తుంది. ఒక చిన్న లైన్‌ని సినిమాగా తీసుకొని ఫన్‌ మోడ్‌లో సినిమా అంతటినీ నడిపించాడు దర్శకుడు అనుదీప్‌. ఇందులో డైలాగ్స్‌ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింపుల్ లైన్ చుట్టూనే తిరుగుతూ విసుగు తెప్పించారు. నిజానికి ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం కూడా ఆసక్తికరంగా ఏమి సాగదు. నూతన దర్శకుడైన కోమల్ పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్ప‌వ‌చ్చు. చైత్ర పాత్రలో కయాదు లోహర్‌ ఒదిగిపోయారు. ముఖ్యంగా అందంతోనే కాకుండా ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక నరేశ్ తన మార్కు మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. సంపత్‌ రాజ్‌, ఈశ్వరీరావుతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా అందంగా సురేష్ సారంగం చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సన్నివేశాలకు ఎడిటర్ నవీన్ నూలి కత్తెర వేయాల్సింది. చిన్న సినిమా అయినప్పటికీ క్వాలిటీ విషయంలో నిర్మాత నాగవంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్రెష్ ఫీల్ మాత్రం కలగదు. కథను నడిపించిన తీరు చూస్తే… థియేట్రికల్ గా కన్నా ఓటీటీల్లో ఎక్కువగా ఆదరణ లభించే అవకాశం ఉందనిపిస్తుంది. మొత్తంగా ఆడియన్స్‌ని నవ్వించే విషయంలో కొంతమేర కె.వి.అనుదీప్‌ విజయం సాధించారని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:
విశ్వక్, కయాదు లోహర్ నటన
అనుదీప్ మార్క్ కామెడీ

మైనస్‌ పాయింట్స్‌:
తీవ్రత లేని కథ, కథనం