థియేటర్లలోకి ‘జన నాయగన్’.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

by | Feb 7, 2026 | సినిమా

కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు విజయ్‌ (Vijay) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జ‌న నాయ‌గన్’ (Jana Nayagan) హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ తెలుగులో ‘ప్ర‌జ‌ల నాయ‌కుడు’ (Prajala Nayakudu) టైటిల్‌తో రానుంది. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘భగవంత్ కేసరి’ కథను ఆధారంగా తీసుకుని తమిళ నేటివిటికి అనుగుణంగా పలు మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమా మొదట నిర్ణయించిన ప్రకారం జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్‌ బోర్డ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తెలిపింది.

అయితే ఈ మూవీ సెన్సార్‌ విషయంలో కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలకాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు సూచించిన మార్పులకు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డ్‌కి కొత్త వర్షెన్ స‌మర్పించి కోర్టు కేసుల‌ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణ‌యించింద‌ని సమాచారం. ఈ క్రమంలోనే ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 20న వరల్డ్ వైడ్ గా విడుదల చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తుంది. కాగా, ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి (Priyamani), సునీల్, రెబా మోనికా జాన్, రేవతి తదితరులు నటించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ సమకూర్చారు.