టాలీవుడ్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గత కొంతకాలంగా సరైన హిట్ కోసం సతమతమవుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలు సిద్ధుకి నిరాశ మిగిల్చాయి. అయినప్పటికీ, తన తదుపరి సినిమాను సిద్ధు చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు సిద్ధు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. సిద్ధు తన తదుపరి చిత్రాన్ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ప్రొడక్షన్ నెం. 40’గా వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సిద్ధు జొన్నలగడ్డకి ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇదిలావుంటే.. ‘డీజే టిల్లు’ (D J Tillu) ఫ్రాంఛైజీతో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధు ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తిగా కొత్త కథతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.

