ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు (Dalailama) ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు (Grami Award) పురస్కారం దక్కింది. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 68వగ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం వేదికగా అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తమ పాటలతో, ఆల్బమ్‌లతో అలరించిన వారు ఈ అవార్డులను అందుకున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు, సంగీత దర్శకులు, సింగర్స్, ప్రొడ్యూసర్స్, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే బెస్ట్ ఆడియో బుక్ ‘మెడిటేషన్- ది రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా’ (Meditation – The reflections of his holiness – The Dalailama) అనే ఆల్బమ్‌కు గాను దలైలామాకు ఈ పురస్కారం లభించింది. ఆధ్యాత్మిక సందేశాలు, శాంతి, మానవ విలువలపై ఆయన అందించిన ఆడియో బుక్‌కు ఈ అవార్డు దక్కింది. ఇక 90 ఏళ్ల వయసులో ఒక వ్యక్తికి గ్రామీ అవార్డు దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ గ్రామీ అవార్డును దలైలామా తరఫున సంగీతకారుడు రూఫస్ వైన్‌రైట్ అందుకున్నారు. సాధారణంగా సంగీత రంగానికి సంబంధించిన అవార్డుల మధ్య ఆధ్యాత్మిక గ్రంథానికి గుర్తింపు దక్కడం ఈసారి గ్రామీ అవార్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, ‘మెడిటేషన్- ది రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా’ అనే పేరుతో దలైలామా చేసిన ప్రసంగాలకు సరోద్ వాయిద్య కళాకారుడు అంజద్ అలీఖాన్ (Amjad Alikhan) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంతర్జాతీయ కళాకారులు అంద్రాడే, మ్యాగీ రోజర్స్, టోనీ సుకార్, టెడ్ నాష్, దేబీనోవా,రూఫస్ వెయిన్‌రైట్ కూడా పనిచేశారు. ఈ ఆల్బమ్‌ను గ్రామీ అవార్డు విజేత కబీర్ సెహగల్ రూపొందించారు. ఈ ఆల్బమ్ ద్వారా ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.

