ధనుష్‌కు జోడీగా శ్రీలీల.. సాయిప‌ల్ల‌వి స్థానంలో స‌డ‌న్‌గా!

by | Feb 1, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో ‘పెళ్లి సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. నటనతో పాటుగా డ్యాన్స్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. అగ్ర హీరోలతో పాటుగా యువ కథానాయకులకు జోడీగా నటిస్తూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఇటీవలే బాలీవుడ్ లో అరంగేట్రం చేయగా.. ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా మరో తమిళ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది శ్రీలీల. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డీ 55’ (D 55)వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నిజానికి ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) హీరోయిన్ గా ఎంపికైనట్లుగా టాక్ నడిచింది. కానీ ఊహించని విధంగా సాయి ప‌ల్ల‌వి స్థానంలో శ్రీలీలను ఎంపిక చేశారు మేకర్స్. అంతకుముందు శ్రీలీల తమిళంలో నటించిన ‘పరాశక్తి’ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. మరి ఈ సినిమాతోనైనా కలిసివస్తుందో అన్నది చూడాలి. ఇక శ్రీలీల ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.