‘ఇరుముడి’పై రీమేక్ రూమర్స్.. ఇందులో నిజమెంత.?

by | Jan 27, 2026 | సినిమా

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), సెన్సిబిల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ కొత్త చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రవితేజ 77వ చిత్రంగా ఈ సినిమా తెరపైకి రానుంది. అయితే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ (Irumudi) అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్ లో అయ్యప్ప మాలలో ఉన్న రవితేజ, తల మీద ఇరుముడి పెట్టుకుని ఓ పాపను ఎత్తుకొని కనిపించారు. కెరీర్ ఆరంభం నుంచి యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో అభిమానులను అలరించిన రవితేజ ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన చాలామంది ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మాలికపురం’ (Malikapuram) రీమేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. 2022 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలోనూ ఇలానే హీరో అయ్యప్ప దీక్షలో పాపను ఎత్తుకొని ఉంటాడు. దీంతో ఈ రెండింటి మధ్య సారూప్యత కనిపించింది. కానీ ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ‘ఇరుముడి’ పూర్తిగా కొత్త కథతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆధ్యాత్మికతకు హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ జతచేసి, తండ్రికూతుళ్ల సెంటిమెంట్ తో శివ నిర్వాణ (Siva Niravana) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఈ వార్తలతో ఈ మూవీ రీమేక్ కాదని తెలిసిపోయింది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) నటించనుండగా.. జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.