‘మెగా158’ను వెంటాడుతున్న ‘జన నాయగన్’ టెన్షన్!

by | Jan 23, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సంక్రాంతి స్పెషల్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఇదే జోరులో చిరంజీవి, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ‘మెగా 158’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. బాబీ కొల్లి ఈ చిత్రాన్ని పూర్తిగా సాలిడ్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అయితే తమిళ హీరో విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayakudu) సినిమా వాయిదా పడడం ‘మెగా158’ మూవీపై ప్రభావం చూపిస్తుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. జన నాయగన్‌ చిత్రాన్ని కూడా కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీదే నిర్మించారు. తెలుగులో చిరంజీవి (Chiranjeevi) హీరోగా రానున్న మెగా158 సినిమాతో అడుగుపెట్టాలని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ (KVN Productions) సంస్థ భావించింది. అయితే ‘జన నాయగన్’ విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు స్టే విధించడంతో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ కేసు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ‘మెగా158’ను ప్రారంభించడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిరు – బాబీ (Bobby) సినిమా మరింత ఆలస్యం కానుంది. నిజానికి ఫిబ్రవరి మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో ‘మెగా 158’ సినిమాను ప్రారంభించాలని మేకర్స్ అనుకున్నారు. కానీ జన నాయగన్‌ సినిమా న్యాయ పరమైన చిక్కుల కారణంగా ‘మెగా158’ మరింత ఆలస్యం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.