యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆస్కార్స్ 2026’ (Oscar) సంబరం మొదలైంది. ఈ ఏడాది పోటీ పడుతున్న చిత్రాల నామినేషన్లను ఆస్కార్ అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో దర్శకుడు రేయాన్ కూగ్లర్ రూపొందించిన ‘సిన్నర్స్’(Sinners) సినిమా ఆస్కార్ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. ఈసారి ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు సాధించి, ఇప్పటివరకూ 14 నామినేషన్లతో ఉన్న ‘ఆల్ అబౌట్ ఈవ్’ (1950), ‘టైటానిక్’ (1997), ‘లా లా ల్యాండ్’ (2016) చిత్రాల పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మైఖేల్ బి.జోర్డాన్ ముఖ్య పాత్ర పోషించారు. క్రీడ్ (2015), బ్లాక్ పాంథర్ (2018) వంటి సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న రేయాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 16 విభాగాల్లో నామినేట్ అవవడానికి గల కారణాలేంటి ? అసలు ఈ సినిమా కథేంటి ? అనేది ఇప్పుడు చూద్దాం…
ఈ సినిమా కథలోకి వెళ్తే 1932 బ్యాగ్డ్రాప్ లో సాగుతుంది. ఇందులో స్మోక్, స్టాక్ అనే ఇద్దరు కవల సోదరులు ఉంటారు. వీరు చికాగోలో మాఫియా చేస్తూ డబ్బులు సంపాదించుకొని తాము పుట్టి పెరిగిన క్లార్క్స్డేల్కు తిరిగి వస్తారు. స్మోక్, స్టాక్ దగ్గర డబ్బు ఉన్నప్పటికి వీరు నల్ల జాతీయులు కావడంతో వీరికి సరైన గౌరవం దక్కదు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు సోదరులు నల్ల జాతీయులు కోసం ఒక మ్యూజిక్ బార్ని ప్రారంభిస్తారు. ఇందులో సామీని సంగీతం అందించేందుకు నియమిస్తారు. ఒక రోజు ముగ్గురు తెల్ల జాతీయులు బార్ లోనికి రాకుండా స్మోక్ అడ్డుపడతాడు. ఈ ముగ్గురు జాంబీలు అనే విషయం స్మోక్ కి తెలియదు. అయితే అక్కడ ఉన్న ఒక అమ్మాయిపై దాడి చేసి ఈ ముగ్గురూ ఆమె రక్తం తాగుతారు. దీంతో ఆమె కూడా జాంబీగా మారుతుంది. వీరందరూ బార్లోకి వెళ్లి స్టాక్‌పై దాడి చేసి రక్తం తాగుతారు. దింతో స్టాక్ కూడా జాంబీగా మారుతాడు. వీరందరి నుంచి స్టోక్ ఫ్యామిలీ ఎలా తప్పించుకుందనేదే ఈ సినిమా మిగతా కథ. ఇలా ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ఆస్కార్ 2026 అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడుతో పాటు అనేక సాంకేతిక విభాగాల్లోనూ పోటీపడనుంది.

