ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వెనుక భారీ స్కెచ్!

by | Jan 18, 2026 | సినిమా

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ల కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ ఫిల్మ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి గతేడాది రిలీజ్ చేసిన వాయిస్ గ్లింప్స్, రీసెంట్​గా వదిలిన పోస్టర్ ఇలా అన్నీ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

అయితే నూతన సంవత్సరం కానుకగా ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్‌ (Prabhas) ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇటీవలే సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ వంటి తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ వెనుక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాస్టర్ స్కెచ్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 2027 మార్చి 5న శుక్రవారం ‘స్పిరిట్’ (Spirit) మూవీ రిలీజైతే ఆ వెంటనే మార్చి 6న శనివారం మహా శివరాత్రి సెలవు, మార్చి 7న ఆదివారం వస్తుంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే రంజాన్, హోలీ, గుడ్ ఫ్రైడే వంటి సెలవు రోజులు రానున్నాయి. హీరో ప్రభాస్ గ్రేస్ కు తోడుగా ఈ మొత్తం హాలిడేస్ ను ఉపయోగించుకుంటే నాలుగు వారాల పాటుగా బాక్సాఫీస్ వద్ద సినిమాకు తిరుగుండదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.