మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా మరో కొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వ వహిస్తుండగా.. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కమెడియన్ సత్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇండో–కొరియన్ హారర్ బ్యాగ్డ్రాప్ లో రానున్న ఈ సినిమా ‘VT 15’ (వర్కింగ్ టైటిల్). వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ రానుండగా భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ని విజయవంతంగా ఈ సినిమా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుణ్ తేజ్‌తో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. గతంలో విడుదలైన పోస్టర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. తాజాగా మేకర్స్ బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 19న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ విభిన్న లుక్ లో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

