ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. స్పిరిట్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

by | Jan 16, 2026 | సినిమా

‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్‌ల కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

ఇందులో ప్రభాస్‌ ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్ లో కనిపిస్తాడని, ప్రభాస్‌ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ సినిమా నిలుస్తుందని చిత్రబృందం చెబుతున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ ఫిల్మ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

కాగా, కొత్త ఏడాది కానుకగా ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ వంటి తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అంతకుముందు ‘స్పిరిట్‌’ నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్‌ ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతూ ఉండగా, చేతిలో మందు బాటిల్ పట్టుకొని ప్రభాస్‌ వెనక్కి తిరిగి నిలబడ్డారు. హీరోయిన్ త్రిప్తి డిమ్రి అతడికి సిగరెట్‌ వెలిగిస్తూ కనిపించింది. ఇక తామెంతో ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో సినీ ప్రేమికులు, ప్రభాస్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.