‘మనశంకర వరప్రసాద్‌గారు’.. బాక్సాఫీస్ దుమ్ము దులిపేశారు!

by | Jan 16, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి- సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ ‘వెంకీ గౌడ’ అనే క్యామియో రోల్ పోషించి ప్రేక్షకులను అలరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు చిరంజీవి కామెడీ టైమింగ్, డ్యాన్సులు, గ్రేస్ అభిమానుల్ని కట్టిపడేశాయి. దాంతో ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే ఎంరూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే చిరంజీవి- అనిల్‌ రావిపూడి కలిసినడుస్తున్న కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లోను మన శంకరవరప్రసాద్ గారుకి అద్భుత స్పందన లభిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం విశేషం. అలాగే ‘బుక్ మై షో’లో ఈ చిత్రం అత్యంత వేగంగా 20 లక్షల టికెట్ల సేల్స్ సాధించిన రీజనల్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ లెక్కన మన శంకరవరప్రసాద్‌ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.