Vishwambhara: ‘విశ్వంభర’ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

by | Apr 9, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి (Chiranjeevi) జోడిగా త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్‌ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల‌లో బిజీగా ఉంది. ఇదివ‌ర‌కే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మేక‌ర్స్ మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే విశ్వంభర (Viswambhara) మూవీ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ను ఏప్రిల్ 12న హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ ను విజయవాడకు సమీపంలో ఉన్న నందిగామ‌లోని ప‌రిటాల శ్రీ ఆంజ‌నేయ స్వామి ఆలయం వ‌ద్ద విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఆంజ‌నేయ స్వామి విగ్రహం ప్రపంచంలోనే రెండో అత్యంత పొడవైన హనుమాన్ విగ్రహం అనే సంగతి తెలిసిందే. ఇక ఈ హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా శ్రీరాముడి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సాంగ్‌ను ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మే 9న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా విడుదల తేదీ అయిన జూలై 24న విశ్వంభర సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా జూలై 24న ‘విశ్వంభర’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలుస్తోంది.