Vijay Devara Konda and Rashmika Mandana Wedding : టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జోడీల్లో ఒకటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్‌లోని ఓ అద్భుతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం సన్నిహిత కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో జరగనుందని సమాచారం. ఇటీవలే విజయ్ దేవరకొండ , రష్మికల వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పెళ్లి పత్రిక ప్రకారం వారి వివాహం ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య జరగనుందని తెలుస్తోంది. ఇక మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని వివాహ పత్రికలో పేర్కొన్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరవుతారని సమాచారం.
ఇదిలాఉంటే.. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలు స్వయంగా తమ వివాహ వేడుక గురించి మొదటి సారిగా అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ తమ పెళ్లి ప్రకటనను అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెళ్లడించారు. అందులో.. ‘మమ్మల్ని ఎంతగానో ఇష్టపడే అభిమానులకు ధన్యవాదాలు, మాకు సంబంధించి ఏ నిర్ణయమైనా, మేము ప్రణాళిక వేసుకోవడానికి ముందు నుంచే మీరు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటున్నారు. అంతే ప్రేమతో మాకు ‘VIROSH’ అనే పేరు కూడా పెట్టారు. ఇకపై మా జోడీని ప్రేమతో అలాగే పిలవండి. మా వేడుకను కూడా ‘THE WEDDING OF VIROSH’ అని పిలవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరినీ ఇంతలా అభిమానిస్తున్నందుకు, ప్రేమిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు..’ అని విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతోంది. కాగా, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా కలిసి నటించిన ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం మరింత బలపడిందనే టాక్ అప్పటినుంచే వినిపిస్తోంది. ప్రస్తుతం మరోసారి ఈ జంట ‘రణబాలి’ అనే ప్రాజెక్ట్‌లో కలిసి నటించబోతున్నారు.


