తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా సురేందర్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా ‘అతనొక్కడే’ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత రవితేజ తో ‘కిక్’, అల్లు అర్జున్ (Allu Arjun) తో ‘రేసుగుర్రం’, రామ్ చరణ్ (Ram Charan) తో ‘ధృవ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. అయితే అక్కినేని అఖిల్ తో చేసిన ‘ఏజెంట్’ ప్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో 32వ చిత్రంగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథ అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ స్టోరీ లైన్ పవన్ కళ్యాణ్ కు నచ్చినప్పటికీ, ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి (Surendar Reddy) తో జరిగిన కథా చర్చల్లో స్క్రిప్ట్ ఆయనను పూర్తిగా మెప్పించలేదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి తీసుకురావాలని, టైమ్ తీసుకున్నా మంచి అవుట్‌పుట్ రావాలనే ఉద్దేశంతో దర్శకుడికి పవన్ కళ్యాణ్ సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి తాత్కాలికంగా విరామం పడిందనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది. గతేడాది ‘ఓజీ’తో సూపర్ హిట్ ట్రాక్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ వెంటనే మరో సినిమా బచేస్తారని ఎదురుచూసిన అభిమానులు ఈ వార్తతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి (Ram Thalluri) ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

