‘ఛావా’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. బాక్సఫీస్ కింగ్‌గా విక్కీ కౌశల్!

by | Feb 15, 2025 | సినిమా

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై తొలి రోజే హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. వాలెంటైన్స్​ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తొలి రోజు ఏకంగా రూ.31 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ దక్కించున్న సినిమాగా చిత్రంగా ‘ఛావా’ నిలిచింది.

ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే ఈ రేంజ్ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. దాంతో పాటుగా ‘ఛావా’ మూవీ ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోను దుమ్మురేపింది. ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 5 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఛావా సినిమాకు మొదటి రోజే హిట్ టాక్‌ రావడంతో వీకెండ్‌లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ బాణీలు అందించారు.