బన్నీ ‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది.. టాప్‌-1లో విక్కీ ‘ఛావా’

by | Mar 2, 2025 | సినిమా

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా'(Chava) . ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. దీంతో ఈ ఏడాది ఈ ఘ‌న‌త‌ను అందుకున్న తొలి సినిమాగా ‘ఛావా’ రికార్డు సాధించింది. ఇటీవలే సెకెండ్ వీక్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ థర్డ్ వీక్ లోకి అడుగుపెట్టింది.

ఈ క్రమంలోనే ఈ మూవీ మూడో శుక్రవారం హిందీ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటివరకు మూడో శుక్రవారం ఉత్తరాదిలో రికార్డు కలెక్షన్స్ తో అల్లు అర్జున్ ‘పుష్ప 2(Puhspa)’ మూవీ టాప్ లో ఉండగా.. తాజాగా దానిని కూడా ఛావా(Chava) మూవీ బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ హిందీ వెర్షన్ రూ.12.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. తాజాగా ఛావా మూవీ రూ.13 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి పుష్ప 2 మూవీని వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం బాక్సఫీస్ వద్ద ఛావా జోరు చూస్తుంటే ఈ వీకెండ్ ముగిసేసారికి సాలిడ్ నెంబర్స్ వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా నటించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.