అగ్ర కథానాయకుడు వెంకటేష్ (Venkatesh) హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను రూపొందించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. సీనియర్ నటుడు నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలువడమే కాకుండా బాక్సఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను రీమేక్ చేసేందుకు చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ రీమేక్ మూవీలో తెలుగులో వెంకటేష్ పోషించిన పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) సినిమా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దాంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రీమేక్‌కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మరో కొత్త దర్శకుడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్ ను హిందీలో రూపొందించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడి ఎంపిక పూర్తయిన తర్వాత ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

