టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Ganguly) బయోపిక్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని ఈ చిత్రాన్ని రూపొందించనుండగా.. లవ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. ఇదే విషయాన్ని తాజాగా సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఈ క్రమంలోనే తన పాత్రలో కనిపించనున్న నటుడు ఎవరో కూడా ఆయన చెప్పేశారు. తాజాగా ఇదే విషయంపై గంగూలీ మాట్లాడుతూ.. నాకు తెలిసినంత వరకు నా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించబోతున్నాడు. నా జీవితంలో కీలక విషయాల్ని విక్రమాదిత్య మోత్వాని ఈ సినిమాలో ఎలా చూపించనున్నాడో అనే ఆసక్తి నాకు కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం ఏడాదైనా పట్టొచ్చు అంటూ’ గంగూలీ చెప్పుకోచ్చాడు. కాగా, గంగూలీ బయోపిక్ గురించి నటుడు రాజ్ కుమార్ రావుని సంప్రదించగా.. అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నిజానికి గంగూలీ బయోపిక్ (Ganguly Biopic) గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ బయోపిక్ గురించి గంగూలీనే అప్‌డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. తన 16 ఏళ్ల కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన సౌరవ్ గంగూలీ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. భారత్ క్రికెట్ జట్టు కష్ట కాలంలో ఉన్న సమయంలో కెప్టెన్సీ చేపట్టి జట్టును అద్భుతంగా నడిపించడంతోపాటు అనేక విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే గంగూలీకి దాదా, బెంగాల్ టైగర్ అనే పేర్లు కూడా పెట్టారు. గంగూలీ తన కెరీర్ లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 18,575 పరుగులు చేశాడు

