పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడుగా సీనియర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గతేడాదే ప్రారంభించగా.. మొదటి షెడ్యూల్ ముగిసాక కొన్ని కారణాల వల్ల షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలవనుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ‘డ్రాగన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఒకటి రీల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. పవర్ స్టార్ ఒకసారి కారు రూఫ్‌పై కూర్చొని ప్రయాణించిన సీన్ ఈ సినిమాలో రాసుకున్నాను. ఇది బిగ్ స్క్రీన్ మీద ఇంకా అద్భుతంగా ఉండనుంది. ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొన్ని శక్తిమంతమైన సంభాషణలు ఇందులో ఉంటాయి అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు.
కాగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా.. అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

