‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ‘సూపర్ యోధ’ ఉపశీర్షిక. ఇక మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ‘మిరాయ్’ (Mirai) మూవీని 8 భాషల్లో ఆగస్టు 1, 2025న 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నిజానికి ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ సినిమాలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర సినిమాలో అత్యంత శక్తివంతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పాత్ర కోసం తొలుత దుల్కర్ సల్మాన్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావించారట. కానీ, ఆయన కాల్షీట్స్ లేకపోవడంతో రానా దగ్గుబాటిని (Daggubati Raja) తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలొనే మూవీ టీమ్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఏకంగా రూ.30 కోట్లకు దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. గౌరహరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సినిమాలో తేజ సజ్జాకు (Teja Sajja) జోడిగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

