సింగీతం కొత్త మూవీ.. 94 ఏళ్ల వయసులో మెగాఫోన్

by | Feb 1, 2026 | సినిమా

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ఒకరని చెప్పొచ్చు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో నుంచి వచ్చిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. కలం పట్టి అద్భుతమైన రచనలు చేస్తూనే, సంగీతంతోనూ ఆకట్టుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సింగీతం శ్రీనివాసరావు తన 94వ యేట మరోసారి మెగా ఫోన్‌ పట్టనున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 61వ సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Vijayanthi Movies Ashwini Dutt) అల్లుడు, యువ దర్శకుడు నాగ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్‌ ఒక వీడియోను పంచుకుంది.

అయితే, ఈ మూవీ టైటిల్ తో పాటుగా నటీనటుల విషయాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కాగా, ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మయూరి, బృందావనం వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. చివరగా ఆయన 2013లో ‘వెల్ కమ్ ఒబామా’ మూవీని రూపొందించారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఎ.డి.’ (Kalki) సాంకేతిక సాయం చేశారు. ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే సింగీతం శ్రీనివాసరావు తర్వాతనే ఎవరైనా అనేలా చెరగని ముద్ర వేశారు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఈ కొత్త సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.